ఓడిపోయిన ప్రస్ట్రేషన్​లో చిల్లర పాలిటిక్స్​..ఎర్రబెల్లిపై యశస్విని రెడ్డి ఫైర్​

ఓడిపోయిన ప్రస్ట్రేషన్​లో చిల్లర పాలిటిక్స్​..ఎర్రబెల్లిపై యశస్విని రెడ్డి ఫైర్​

పాలకుర్తి, వెలుగు: ‘బీఆర్ఎస్​ నాయకులకు అత్తా కోడళ్ల సీరియల్​ కావాలంటే చెప్పండి. మీకు ఎంటర్​టైన్​మెంట్​ కావాలంటే ఎవరితోనైనా మాట్లాడి సీరియల్ తీయిస్తా.. ఎందుకు నిత్యం మా వెంట పడుతున్నారు. మేమంటే అంత అలుసు, హేళన ఎందుకు? మాపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, మేం ఎప్పుడు రియాక్ట్​ కాలేదు. ఇంకోసారి మాపై లేనిపోని ఆరోపణలు చేస్తే అస్సలు బాగుండదు. మీకు కుటుంబాలు ఉన్నాయి, ఒకరి ఇంట్లో కావాలని తొంగిచూసి లేనివన్నీ సినిమాటిక్​గా సృష్టించి మా ఇంట్లో చిచ్చుపెట్టేలా ప్రవర్తించడం సంస్కారం కాదు’ అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుపై ఘాటు విమర్శలు చేశారు.

బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని క్యాంప్​ ఆఫీస్​లో తన అత్త, కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ది కోసం తాను పని చేస్తుంటే, ఓడిపోయిన ప్రస్ట్రేషన్​లో ఎర్రబెల్లి సోషల్​ మీడియా ద్వారా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేసి, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే పాలకుర్తి శివారు వరకు తరిమి కొడతామని హెచ్చరించారు.

ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ దోచుకోవడానికే ఇక్కడికి వచ్చారని, పాలకుర్తిని వదిలి తాము అమెరికా వెళ్లి పోతామని అసత్య ప్రచారం చేస్తున్నారని, పాలకుర్తిని వదిలి వెళ్ళాల్సి వస్తే ఎర్రబెల్లి అంతు చూసే పోతానని హెచ్చరించారు. తాము అత్తా కోడళ్లమే కాదు, ఆడ పులులం అంటూ సవాల్​ చేశారు. గెలిచినప్పటి నుంచి వ్యక్తిగత విమర్శలు చేస్తూ తమను ఏడిపిస్తున్నారని, తమ ఏడుపు వారికి తప్పకుండా తాకుతుందన్నారు.